తెలంగాణ లో జూన్‌ 20 నాటికి వరి ధాన్యం సేకరణ పూర్తి ...

 


రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 20  నాటికి వరి ధాన్యం సేకరణ ముగిసే అవకాశాలున్నాయని, మెజారిటీ జిల్లాల్లో మరో వారం రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తవుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్‌, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొనుగోళ్లు చివరి దశకు వచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 6,544 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఇప్పటికే పూర్తయ్యిందని, రోజుకు లక్షన్నర నుంచి రెండున్నర లక్షల టన్నుల సేకరణ జరుగుతోందని తెలిపారు. 


రూ. 5,888 కోట్ల విలువైన 30.09 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని 4 లక్షల 72 వేల మంది రైతుల నుంచి సేకరించినట్లు మంత్రి వివరించారు. కాగా, వివిధ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి ఐసీఐసీఐ అకాడమీ ఫర్‌ స్కిల్‌ సంస్థతో బీసీ, ఎంబీసీ కార్పోరేషన్లు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఈ మేరకు మంగళవారం మంత్రి గంగుల కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఐసీఐసీఐ ప్రతినిధి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. బీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి సంబంధిత అంశాల్లో ఉచిత శిక్షణ అందిస్తామని చెప్పారు.