2023లో మహేశ్‌బాబు, రాజమౌళి సినిమా షూటింగు స్టార్ట్...

 


టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు మరికొన్ని గంటల్లో సర్కారువారి పాట పాడేందుకు మన ముందుకు వస్తున్నాడు. మే12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌  తెరకెక్కించే సినిమాలో నటించనున్నాడు మహేశ్‌. దీంతో పాటు రాజమౌళి దర్శకత్వంలో కూడా ప్రిన్స్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్లలో పాల్గొన్న దర్శక ధీరుడు ఈ విషయంపై మాట్లాడుతూ వచ్చే ఏడాది ప్రారంభంలో మహేశ్‌తో సినిమా ఉంటుందన్నాడు. తాజాగా ప్రముఖ సినీ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌  కూడా రాజమౌళి- మహేశ్‌ కాంబోపై స్పందించారు. ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఇండియానా జోన్స్‌లా .. ‘ప్రస్తుతం మహేశ్‌ కోసం కథను సిద్ధం చేస్తున్నాం. స్క్రిప్ట్‌ వర్క్‌ ఇంకా పూర్తి కాలేదు. అడవి నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ ఏడాదంతా మహేశ్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేస్తున్న మూవీతో బిజీగా ఉంటారు. అందుకే రాజమౌళితో సినిమా 2023 ప్రథమార్థంలోనే మొదలవుతుంది’ అని చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్‌. కాగా మహేశ్‌- రాజమౌళి సినిమాను దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ నిర్మించనున్నారు. కాగా ఇటీవల మహేశ్‌ కూడా రాజమౌళి చిత్రంపై స్పందించారు. దర్శకధీరుడితో కలిసి పనిచేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. ఇండియానా జోన్స్‌ సినిమాలా ఈ చిత్రం ఉంటుందని, కచ్చితంగా ఇదొక అద్భుతమైన ప్రాజెక్టు అని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడవుతాయని మహేశ్‌ పేర్కొన్నారు.