దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.27 మంది అగ్నికి సజీవ దహనం..

 


దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని ముంద్కా మెట్రోస్టేషన్‌ సమీపంలోని మూడంతస్తుల వాణిజ్య భవనంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరింది. ఈ ఘటనలో 27 మంది అగ్నికి ఆహుతయ్యారు.


 మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. కాగా.. మృతదేహాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ బృందం సహాయం తీసుకోనున్నట్లు ఔటర్ జిల్లా డీసీపీ ఎస్ శర్మ తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కంపెనీ యజమానులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.


కంపెనీ యజమానుల అరెస్ట్.. 

కంపెనీ యజమానులు హరీష్ గోయెల్, వరుణ్ గోయల్‌లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. భవనం యజమాని మనీష్ లక్రాగా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని.. మరియు త్వరలో పట్టుకుంటామని డీసీపీ సమీర్ శర్మ పేర్కొన్నారు. ముంద్కా మెట్రోస్టేషన్‌ పోల్ నంబర్ 544 దగ్గర జరిగింది. ఘటనాస్థలం నుంచి 60-70 మందిని కాపాడి బయటికి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం 4.40 గంటలకు సమాచారం అందగానే.. 24 ఫైర్ ఇంజన్లతో వెంటనే చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

మృతుల కుటుంబాలకు సాయం..  

కాగా.. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం కేజ్రీవాల్ స్పందించారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్‌ చేశారు. ఈ ఘటన తనను తీవ్ర కలిచివేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం ప్రకటిస్తూ ప్రధాని కార్యాలయం ఈ సంర్భంగా ట్వీట్‌ చేసింది.