దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతల పాదయాత్ర..

 


దేశవ్యాప్తంగా బలం పుంజుకోవడానికి, దూరమైన వర్గాలను దరిజేర్చుకునేందుకు కాంగ్రెస్‌ యాత్రల బాట పడుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు ‘భారత్‌ జోడో యాత్ర’ పేరిట పాదయాత్ర చేపట్టనున్నట్లు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వెల్లడించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడ్రోజులపాటు ‘నవసంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌’ పేరిట కాంగ్రెస్‌ నిర్వహించిన మేధో మథన సదస్సు ఆదివారం ముగిసింది. 450 మందికిపైగా ప్రతినిధులు విస్తృతంగా చర్చించిన అంశాలను క్రోడీకరించి ‘ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌’ పేరిట ఆమోదించి ప్రకటించారు.పార్టీ భావి కార్యాచరణను, సంస్థాగత సంస్కరణలను అందులో ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రధాని మోదీ హయాంలో సమాజంలో వివిధ వర్గాల మధ్య సామరస్యం దెబ్బతిందని.. సామరస్యాన్ని పరిరక్షించేందుకు, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు అక్టోబరు 2న గాంధీ జయంతి నుంచి ‘భారత్‌ జోడో యాత్ర’ ప్రారంభించాలని నిర్ణయించినట్లు అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు. ఇది ఏడాదిపాటు జరుగుతుందన్నారు. ఇక నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై వచ్చే నెల 15 నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లో ‘జనజాగరణ్‌ యాత్ర’ రెండో దశను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పార్టీని పూర్తి సన్నద్ధం చేసే ‘నవ సంకల్ప్‌’ రోడ్‌మ్యా్‌పను కూడా ‘డిక్లరేషన్‌’ ఆమోదించింది. అన్ని స్థాయుల పదవుల్లో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ఇస్తున్న 20 శాతం ప్రాతినిధ్యాన్ని 50 శాతానికి పెంచాలని, ఉపకులాలకు కూడా అత్యధిక ప్రాధాన్యమివ్వాలని చింతన్‌ శిబిర్‌ నిర్ణయించింది.మార్పుల గురించి ఎప్పటికప్పుడు అధ్యక్షురాలికి సల హా ఇచ్చేందుకు జాతీయ స్థాయిలో సామాజిక న్యాయ సలహా మండలిని ఏర్పాటు చేస్తారు. ప్రతి ఆరు నెలలకు ప్రత్యేక వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిపి పార్టీలో సామాజిక న్యాయం అమలు తీరును సమీక్షిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉపాధి తగ్గిపోతున్నందున ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్‌కు మద్దతివ్వాలని పార్టీ నిర్ణయించింది. పార్లమెంటు, అసెంబ్లీల్లో ఓబీసీలకు రిజర్వేషన్‌ కల్పించాలని, మహిళా రిజర్వేషన్‌ బి ల్లు కోసం పోరాడాలని.. బలహీనవర్గాలు, మైనారిటీలకు ఇచ్చే కోటాలో మహిళలకూ ప్రాతినిఽధ్యం కల్పించాలని నిర్ణయించింది. అలాగే యువతకు పెద్దపీట వేసే దిశగా 2024 నుంచి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సగం టికెట్లు 50 ఏళ్లలోపు వారికే ఇవ్వాలని తీర్మానించింది.