మరో క్రేజీ డైరెక్టర్ తో చరణ్ సినిమా..?

 


మెగా‌పవర్ స్టార్ రామ్‌చరణ్ ఇటీవల విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్’  చిత్రంతో పాన్‌ఇండియా స్టార్ అయ్యాడు. తాజాగా తమిళ క్రేజీ దర్శకుడు శంకర్  తో ఒక సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పలు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో చెర్రీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఇక దీని తర్వాత రామ్‌చరణ్‌తో సినిమా చేయడానికి ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రెడీగా ఉన్నాడు. అలాగే చరణ్ తో సినిమాలు చేయడానికి పలువురు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. రామ్‌చరణ్ మరో తమిళ దర్శకుడితో ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం.  


‘ఖైదీ, మాస్టర్’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ . ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘విక్రమ్’  సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 3న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత లోకేష్ రజినీకాంత్, అజిత్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయబోతున్నాడు. వీటితో పాటు లోకేష్ .. ఇటీవల రామ్‌చరణ్ ( కు ఒక కథ చెప్పాడని, దానికి బాగా ఇంప్రెస్ అయిన చెర్రీ అతడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం చరణ్‌కు బోలెడన్ని కమిట్‌‌మెంట్స్ ఉండడంతో చిత్రాన్ని హోల్డ్‌లో పెట్టాడని తెలుస్తోంది.


లోకేష్ కనగరాజ్ వరుస విజయాలు సాధిస్తున్న నేపథ్యంలోనే చెర్రీ అతడితో సినిమా చేయడానికి అంగీకరించాడని వేరే చెప్పాలా? ప్రస్తుతం తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వారి లిస్ట్ లోకి ఇప్పుడు లోకేష్ కూడా చేరడం విశేషం. వచ్చేనెల్లో రాబోతున్న విక్రమ్ (vikram) సినిమాతో కూడా లోకేష్ సూపర్ హిట్ అందుకుంటే.. అతడికిక తిరుగే ఉండదు. తెలుగులో మరికొందరు స్టార్ హీరోలు అతడితో సినిమాలు చేయడానికి ముందుకొస్తారు. మరి చెర్రీ - లోకేష్ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి.