ఏపీ లో అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ రూ.60 వేల కోట్ల వ్యయంతో రెండు కాలుష్య రహిత విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. వీటిలో ఒకటి 3,700 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుకాగా.. రెండోది పది వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు. ఆదివారం దావో్‌సలో సీఎం జగన్మోహన్రెడ్డితో సమావేశమైన అదానీ గ్రూపు సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ సోమవారం కూడా ఆయన్ను కలిశారు. పై ప్రాజెక్టులపై సవివరంగా చర్చించి.. అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కూడా కుదుర్చుకున్నారు. వారిద్దరి సమక్షంలో రాష్ట్రప్రభుత్వం తరఫున ప్రత్యేక సీఎస్ కరికాల వలవన్, అదానీ గ్రీన్ ఎనర్జీ తరఫున ఆశిష్ రాజవంశీ సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టులతో సుమారు పది వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. కాగా.. మేజర్ టెక్నాలజీ హబ్‌గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలని సంకల్పించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సోమవారం దావో్‌సలో భాగంగా ఆయన పలు కంపెనీల సీఈవోలు, ఎండీలతో సమావేశమయ్యారు. టెక్‌మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీతో మాట్లాడారు. నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. కృత్రిమ మేధ(ఏఐ)కు కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దాలని, దీనికోసం కలిసిరావాలని ఆహ్వానించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు గుర్నానీ తెలిపారు.
విశ్వవిద్యాలయంతో కలిసి నైపుణ్యాలను పెంచేందుకు, హై ఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో ప్రత్యేక పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. టెక్ మహీంద్రా అనుబంధ సంస్థ అసాగో.. రాష్ట్రంలో రూ.250 కోట్లతో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు సుముఖత కనబరచింది. మరోవైపు దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు ఫ్లోరెన్స్ వెర్జలెన్ను సీఎం కలిశారు. త్రీడీ సంబంధిత ఉత్పత్తులను ఈ ఫ్రెంచ్ సాఫ్ట్వేర్ కంపెనీ తయారుచేస్తుంది.