తెలంగాణ రాజ్యసభ సభ్యులపై ఇవాళ సీఎం కేసీఆర్‌ నిర్ణయం...

 


 తెలంగాణ రాజ్యసభ సభ్యులపై ఇవాళ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోనున్నారు.  రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనుండడంతో… అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.


తెలంగాణ నుంచి రాజ్యసభకు ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయన్న చర్చ అధికారపార్టీలో జోరుగా జరుగుతోంది.


తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్‌ఎస్‌ కోశాధికారిగా వ్యవహరించిన దామోదర్‌రావు, పారిశ్రామికవేత్త-హెటిరో సంస్థ అధినేత పార్ధసారథిరెడ్డి…ఈ ఇద్దరికి రాజ్యసభ టికెట్లు ఫైనల్‌ అయినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమనేంతగా గులాబీశ్రేణుల్లో చర్చ నడుస్తోంది. మూడో సీటును బీసీ లేదా ఎస్సీ నేతలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


మరోవైపు ఈనెల 20 నుంచి ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టేందుకు సర్కార్‌ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం కేసీఆర్‌.. పల్లె, పట్టణ ప్రగతిపై సమీక్షించనున్నారు. ప్రధానంగా బృహత్‌ ప్రకృతి వనాలు, పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లపై రివ్యూ చేయనున్నారు.


అలాగే వరిధాన్యం కొనుగోళ్లు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో మంత్రులు, జడ్పీ చైర్‌పర్సన్‌లు, కలెక్టర్లు, మునిసిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు, అధికారులు పాల్గొననున్నారు.