ప్రతి నెలా నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే మంత్రి వెల్లడి..

 


ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రతి నెలా నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే మంత్రి వెల్లడించారు. భారతీయ రైల్వేను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ . ఇప్పటికే ఢిల్లీ- వారణాసి, ఢిల్లీ- వైష్ణోదేవి కట్రా మధ్య రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ వందే భారత్ రైలు గంటకు దాదాపు 160 కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. ఆగష్టు నాటికి మరో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ఇవి తయారీ చివరి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో 400 కొత్త తరం వందే భారత్ రైళ్లు రానున్నాయని ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. దేశవ్యాప్తంగా 75 నగరాలను కలుపుతూ 75 కొత్త వందే భారత్ రైళ్లు రానున్నాయని గతేడాది ఆగష్టు 15 న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేశారు.


ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో వందే భారత్ రైలు బోగీల తయారీ వేగం పుంజుకుంటోంది. స్వదేశీ డిజైన్‌, స్వదేశీ తయారీ ప్రాధాన్యంగా వీటిని రూపొందిస్తున్నారు. తమకు 200 వందే భారత్‌ రైళ్లు అవసరమని, తమిళనాడుకే 13 కావాలని రైల్వేశాఖ నుంచి ఐసీఎఫ్‌కు సమాచారం ఇచ్చారు. వీటికి తగ్గట్లే విడిభాగాల కొనుగోళ్లకు ఐసీఎఫ్‌లో టెండర్లను పిలిచారు. పట్టాల సామర్థ్యాన్ని క్రమంగా పెంచుకుంటూ ఈ రైళ్లను అందుబాటులోకి తెస్తారు. తొలి ప్రాధాన్యంగా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ తిరిగే మార్గాల్లో వాటి స్థానంలో వందే భారత్‌ రైళ్లను నడపాలని ఆలోచిస్తున్నారు