నేడు నారాయణపేట జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్..

 


ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో రూ. 81.94 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సాయంత్రం జరిగే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.

మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం 11గంటలకు నారాయణపేట చేరుకుంటారు. సింగారం వద్ద మిషన్ భగీరథ పంప్ హౌస్, అక్కడే సబ్ స్టేషన్ ను ప్రారంభిస్తారు. 11.30 గంటలకు ఆరో వార్డులో రూ. 1.20 కోట్లతో నిర్మించనున్న పార్కు నిర్మాణం కోసం శంకుస్థాపన, టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో బీసీ కాలనీ పార్కు వద్ద రూ.20కోట్లతో నిర్మించనున్న గోల్డ్ సోక్ మార్కెట్ కు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేస్తారు. రూ. 6.65 కోట్లతో మినీ స్టేడియం పనులకు శంకుస్థాపన చేస్తారు. 11.50 గంటలకు ఎర్రగుట్ట వద్ద రూ. 2కోట్లతో నిర్మించ తలపెట్టిన జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. రజకులకోసం రూ. కోటితో చేపట్టే ఆధునిక లాండ్రీకి భూమిపూజ చేస్తారు.

మధ్యాహ్నం 12.15 గంటలకు పాత బస్టాండ్ వద్ద రూ. 1.35 కోట్లతో నిర్మించిన నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభోత్సవం చేయడంతో పాటు, రూ. కోటి నిధులతో చేపట్టే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేటీఆర్ భూమిపూజ చేస్తారు. మధ్యాహ్నం 12గంటలకు సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనులకు, మధ్యాహ్నం 1గంటకు కొండారెడ్డి పల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసే పనులకు భూమిపూజ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు వృద్ధాశ్రమాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 3గంటలకు నారాయణపేట జిల్లాలో జరిగే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు.