తుఫాన్ల నుంచి రైతులను రక్షించేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

 తుఫాన్ల నుంచి రైతులను రక్షించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. పట్టిసీమ అవసరం లేకుండానే ఈసారి ముందస్తుగానే సాగు నీరు ఇవ్వాలని నిర్ణయించింది.


పులిచింతల జలాశయంలో 36 టీఎంసీల నీళ్లున్నాయని, ఈ నీటిని ప్రకాశం బ్యారేజికి విడుదల చేసి కృష్ణా ఆయకట్టుకు, జూన్‌ 10 నుంచే సాగునీరు ఇవ్వనున్నట్టు వెల్లడించారు మంత్రి అంబటి రాంబాబు. పట్టిసీమ అవసరం లేకుండానే ఈసారి ముందస్తుగానే సాగు నీరు అందివ్వనున్నట్టు చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జూన్‌లోనే ‌సాగునీరు ఇస్తున్నామని వివరించారు. వర్షాకాలం ముందే రానుందని, సకాలంలో వర్షాలు పడతాయని భావిస్తున్నామని అన్నారు అంబటి రాంబాబు.


జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్‌తో కలిసి పులిచింతల ప్రాజెక్టును పరిశీలించారు మంత్రి అంబటి రాంబాబు. గతేడాది కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్త గేటు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, సాంకేతిక నిపుణులు దానిపై పనిచేస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతానికి స్టాప్‌ గేటు ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులోనూ నీళ్లున్నాయని, సాగర్‌ ఆయకట్టుకూ జులై 15 నుంచి సాగునీరు సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు.