నేడే హైదరాబద్ కు అమిత్ షా..
  తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, కుటుంబ నియంతృత్వ పాలనకు చరమగీతం పడడమే లక్ష్యంగా, అధికార టీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపి ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర – 2 శనివారం ముగియనుంది.


ఏప్రిల్ 14న అలంపూర్ లోని జాగులాంబ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర శనివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ముగియనుంది. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా..తెలంగాణ బీజేపీ శ్రేణులు భారీ సభకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ కు అతి సమీపంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. ఈ సభకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా హాజరుకానున్నారు. ఈమేరకు శుక్రవారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించారు.


సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ముందుకు సాగుతుంది. ఈక్రమంలో రాష్ట్రంలో పార్టీని, క్యాడర్ ను బలోపేతం చేసేందుకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. గతంలో తెలంగాణలో జరిగిన ఇతర చిన్న సమావేశాలకు సైతం అమిత్ షా వచ్చారంటే..తెలంగాణ పై పట్టు బిగించడం కోసం బీజేపీ అధిష్టానం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తుంది. ఈక్రమంలోనే శనివారం(నేడు) తుక్కుగూడలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేపడుతున్నారు బీజేపీ నేతలు. శనివారం సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి శ్రీశైలం హైవే మీదుగా తుక్కుగూడ చేరుకోవచ్చు

సభకు వచ్చే వారి కోసం ఆరు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు. జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జనసమీకరణ చేపట్టారు. ఈనేపధ్యంలో భారీగా జనం సభకు రావొచ్చని భాజపా శ్రేణులు భావిస్తున్నాయి. కాగా, బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం నోవొటెల్ హోటల్ లో జరిగే భాజపా కోర్ కమిటీ సమావేశంలో పాల్గొని, రహస్త్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర బీజేపీ నేతలతో చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో తుక్కుగూడ బహిరంగలో అమిత్ షా పాల్గొననున్నారు.