'హనీట్రాప్‌'లో చిక్కిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అధికారి. దేశ సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు..

 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అధికారి దేవేంద్ర శర్మను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ 'హనీట్రాప్‌'లో చిక్కుకుని దేశ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని లీక్ చేసినట్లు శర్మపై ఆరోపణలు ఉన్నాయి. పాకిస్థాన్ మహిళ సోషల్ మీడియా ద్వారా దేవేంద్ర శర్మను ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతను ఢిల్లీ ఎయిర్​ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, మిలిటరీ ఇంటెలిజెన్స్, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి దేవేంద్ర శర్మను అదుపులోకి తీసుకుంది.


అతని ద్వారా సమాచారం బయటకు వెళ్తున్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే ఈ చర్యలకు ఉపక్రమించారు. మే 6న కస్టడీలోకి తీసుకోగా.. గురువారం విచారణ ప్రారంభించారు. ఆధారాలు, సాక్ష్యాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు దేవేంద్ర శర్మను అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు వెల్లడించారు.