ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పర్యటనను అడ్డుకున్న పోలీసులు..

 


ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ  సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు. బాలకృష్ణ పర్యటన పోలీసులకు పెను సవాల్‌గా మారింది. తన సొంత నియోజకవర్గం హిందూపురం వెళుతున్న బాలయ్యను చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. బాలకృష్ణ వెంట వెళుతున్న వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో పోలీసులతో టీడీపీ నేతలు, బాలయ్య అభిమానులు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ టెన్షన్‌ వాతావరణం నెలకొంది.


హిందూపురం నియోజకవర్దం కొడికొండలో మూడు రోజుల క్రితం జరిగిన జాతరలో టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో గాయపడ్డ టీడీపీ నేతలను పరామర్శించేందుకు వచ్చారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఈ క్రమంలోనే గ్రామంలోకి కన్వాయి వద్దని అడ్డుకున్నారు. కేవలం ఎమ్మెల్యే బాలక్రిష్ణ వాహనాన్ని మాత్రమే అనుమతిస్తామన్నారు పోలీసులు. గ్రామంలో నెలకొన్న ఘర్షణ వాతావరణం ఇంకా పూర్తిగా చల్లబడలేదని.. ఎక్కువ వాహనాలను అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు తెలిపారు.


దీంతో ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు, బాలయ్య అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే బాలకృష్ణతో ఉన్నతాధికారులు మాట్లాడారు. గ్రామానికి ఎక్కువ మంది వెళితే గొడవలు జరిగే ప్రమాదం ఉందని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల సూచనకు బాలయ్య అంగీకరించారు. బాలకృష్ణ రాకతో భారీగా తరలివచ్చారు టీడీపీ కార్యకర్తలు.