అటు వైసీపీ నేతలు యాత్రకు సిద్ధమవుతుంటే.. ఇటు మహానాడు ఏర్పాట్లలో టీడీపీ బిజీ అయింది.

 


అటు వైసీపీ నేతలు యాత్రకు సిద్ధమవుతుంటే.. ఇటు మహానాడు ఏర్పాట్లలో టీడీపీ బిజీ అయింది. టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కు కేవలం 24గంటలు మాత్రమే సమయం ఉంది. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆ ఏర్పాట్లలో మునిగిపోయారు. ఇవాళ ఉదయం 10 గంటలకు మంగళగిరిలోని టీడీపీ హెడ్ ఆఫీస్ నుంచి ఒంగోలు వరకు టీడీపీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించనుంది. 3వేల వరకు బైక్‌లు పాల్గొనే అవకాశం ఉందని పార్టీ అంచనా వేస్తోంది. సాయంత్రం 4 గంటలకు ఒంగోలులో పొలిట్ బ్యూరో మీటింగ్ ఉంటుంది. మహానాడులో ప్రవేశపెట్టబోయే తీర్మానాలతో పాటు, ఇతర సమస్యలపై చర్చ జరగనుంది.


స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రతి ఏటా మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు జరుగుతుంది. మొదటిరోజు జరిగే ప్రజాప్రతినిధుల సమావేశానికి 12 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. రెండవ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించున్నారు. దీనికి సుమారు లక్ష మందికి పైగా కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టే పార్టీ ఏర్పాట్లు చేస్తోంది పార్టీ. మరోవైపు మహానాడుకి ఆటంకాలు సృష్టిస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మహానాడు ప్రాంగణానికి వాహనాలు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వాహనాలు ఇవ్వకుండా అడ్డుకుంటే చీమల దండులా కదులుతామన్నారు. బస్సులు ఇవ్వకపోతే.. బైకులు, ట్రాక్టర్లు, సొంత వాహనాల మీద మహానాడుకు రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.