భారత్, నేపాల్ మధ్య కీలక ఒప్పందాలు..

 


భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య ఆరు అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్స్ రిలేషన్స్, లుంబిని బుద్ధిస్ట్ యూనివర్శిటీ, త్రిభువన్ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన వివిధ ఒప్పందాలు జరిగాయి. మోదీ, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా  మధ్య సోమవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఆరు ఎంఓయూలపై ఇరుదేశాలు సంతకాలు జరిగాయి. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై ఇరువురు ప్రధానులు చర్చించారు.


దీనికి ముందు, లుంబిని ఆలయంలోని మాయాదేవి ఆలయాన్ని షేర్‌ బహదూర్ దేవుబాతో కలిసి మోదీ సందర్శించారు. ప్రత్యేక పూజలు జరిపారు. మహోబోధి చెట్టుకు నీళ్లుపోశారు. ఈ సందర్భంగా నేపాల్‌తో భారత్‌కు ఉన్న అనుబంధం హిమాలయాల పర్వతాల స్థాయికి చేరాలని అభిలషించారు. వేల సంవత్సరాలుగా నేపాల్‌తో భారత్ బంధం కొనసాగుతోందన్నారు. ఈ అనుబంధాన్ని శాస్త్ర, సాంకేతక, మౌలిక సదుపాయాలు, తదితర రంగాలకు విస్తరించాలని సూచించారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్ల సమయంలో ఇరుదేశాల మధ్య బంధం చాలా కీలకమని అన్నారు. బుద్ధుడు అందరివాడని, రాముడికి నేపాల్‌తో బంధం ఉందని, నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణమని అన్నారు. ఇరుదేశాల సంబంధాలు హిమాలయన్ హైట్స్‌కు చేరాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.