దేశీయ విమానయాన సంస్థలకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ

 


దేశీయ విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. విమానయాన సంస్థల్లో పనిచేసే తమ ఉద్యోగుల్లో 50 శాతం మంది పైలెట్లు, క్యాబిన్ క్రూ మెంబర్స్ (సహాయకులు) తప్పకుండా ప్రతిరోజూ ప్రయాణానికి ముందు మద్యపానం పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు జరిపిన బ్రీత్ అనలైజర్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన ఉద్యోగుల్లో 9 మంది పైలెట్లు, 32 మంది క్యాబిన్ క్రూ సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు మంగళవారం డీజీసీఏ ఒక ప్రకటనలో పేర్కొంది.


ఇందులో ఇద్దరు పైలట్లు, ఇద్దరు సహాయకులు ఇప్పటికే 2 సార్లు మద్యం తాగి పట్టుబడటంతో వారిని 3 ఏళ్ల పాటు విధుల నుంచి తొలగించింది. మిగతా ఏడుగురు పైలట్లు, 30 మంది క్యాబిన్ క్రూ సిబ్బందిని 3 నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా విధుల నుంచి తొలగించబడిన వారిలో ఇండిగో ఎయిర్ లైన్స్, స్పైస్ జెట్, ఎయిర్ ఏషియా, విస్తారా, అలియన్స్ ఎయిర్ ఉద్యోగులు ఉన్నారు. కాగా, దేశంలో కొవిడ్ ప్రవేశించకముందు ప్రతిరోజూ విమానయాన సంస్థల ఉద్యోగులకు బ్రీత్ అనలైజర్ టెస్టులు జరిగేవని, కరోనా ప్రవేశం తర్వాత దానిని సస్పెండ్ చేసినట్లు డీజీసీఏ పేర్కొంది. ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు మెరుగవ్వడంతో ఈ ఏడాది జనవరి 1 నుంచి తిరిగి ఈ టెస్టులను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపింది