కేరళ, తమిళనాడులో 'టమాట ఫ్లూ' వైరస్ కలకలం..

 


కేరళ, తమిళనాడులో అంతుచిక్కని కొత్త వైరస్​ కలకలం రేపుతున్నది.
దాని వల్ల ఐదేండ్ల లోపు చిన్నారులు 'టమాట ఫ్లూ' బారినపడుతున్నారు. శరీరంపైన టమాట ఆకారంలో ఎర్రగా దద్దులు రావడంతో దీన్ని ప్రస్తుతం 'టమాట ఫ్లూ'గా పిలుస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో వంద మందికి పైగా వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. కేరళలోని కొల్లం జిల్లాలోనే 80 మందికిపైగా చిన్నారులు టమాట ఫ్లూ బారినపడ్డారు. ఈ ఫ్లూ వల్ల మరణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. అయితే.. ఈ వ్యాధికి, టమాటకు ఎలాంటి సంబంధం లేదని డాక్టర్లు, సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. చికున్​గున్యా, డెంగ్యూ లక్షణాలే ఈ వ్యాధిలోనూ కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని, పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. ఐదేండ్లలోపు చిన్నారుల్లోనే ఎక్కువగా వ్యాధి లక్షణాలు బయటపుడుతున్నాయని అంటున్నారు.


ప్రత్యేక బృందాల ఏర్పాటు


కేరళ, తమిళనాడు బోర్డర్​ జిల్లాల్లో 'టమాట ఫ్లూ' లక్షణాలు బయటపడటంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్​ అయ్యాయి. ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశాయి. పిల్లల్లో ఫ్లూ లక్షణాలు ఉంటే వారిని వెంటనే గుర్తించి టెస్టులు చేస్తున్నారు. అవసరమైన చికిత్స అందిస్తున్నారు. వ్యాధి వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. చెక్​ పోస్టుల వద్ద వాహనాలను ఆపి, పిల్లలను ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అంగన్​వాడీ కేంద్రాల్లో పిల్లల ఆరోగ్య పరిస్థితిపై స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. లక్షణాలు ఉన్న చిన్నారుల్లో ఎక్కువ మంది శరీరంపై ఎర్రటి దద్దులు, కాళ్లు చేతులు రంగు మారడం, తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని వైద్య బృందాలు వెల్లడించాయి. మరికొందరు చిన్నారుల్లో ఈ సింప్టమ్స్​తోపాటు దగ్గు వంటి లక్షణాలూ ఉంటున్నాయని తెలిపాయి.


నివారణ, చికిత్స


టమాట ఫ్లూ లక్షణాలున్న పిల్లలను ఇతర పిల్లలకు దూరంగా ఉంచాలి. డాక్టర్ సలహా మేరకు జ్వరం, దద్దులు తగ్గడానికి కావాల్సిన మెడిసిన్​ను పిల్లలకు అందించాలి. దద్దులపై గోర్లతో పిల్లలను గిల్లుకోనివ్వొద్దు. దోమలు కుట్టకుండా కాపాడుకోవాలి. పరిశుభ్రత పాటించాలి. తాగేందుకు గోరువెచ్చని నీళ్లు ఇవ్వాలి.


టమాట ఫ్లూ లక్షణాలు


శరీరంపై ఎర్రటి దద్దులు, దురద, తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు, నీరసం. మరికొందరిలో వీటితోపాటు వాంతులు, దగ్గు, తుమ్ములు, సర్ది.