కేసిఆర్ పై తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

 


కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగం కొన్ని రాజకీయ పార్టీలకు చెంపపెట్టులాంటిదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మతల్లి గుడిని ఆయన సందర్శించారు. ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ 31 రోజుల్లో 383 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. పాదయాత్ర, బహిరంగ సభకు భారీగా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు తరలి వచ్చి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత విద్య, వైద్యం అనే హామీకి కట్టుబడి ఉన్నామన్న బండి సంజయ్.. ప్రజల నుంచి పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. పేదరికంతో ఎంతో మంది గుడిసెల్లో నివసిస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నిలువ నీడలేని అర్హులైన పేదలందరికి ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం హామీని అమలు చేసి, ఖాళీలను భర్తీ చేస్తామని వివరించారు. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి, పెట్రోల్, డీజిల్ ధరలను వ్యాట్ తగ్గిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాం హౌస్ లో వ్యవసాయం చేస్తూ కోటీశ్వరుడు అవుతుంటే రైతులు మాత్రం కేసీఆర్ నిర్ణయాలతో బికారులు అవుతున్నారని బండి సంజయ్ ఆక్షేపించారు.


కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకుంటాం. నీళ్లు, నిధులు, నియామకాలలో న్యాయం జరగాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే. మా ప్రభుత్వం వస్తే బాయిల్డ్ రైస్ కొంటాం. 4% ఉన్న మైనారిటీ రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం. గంగిరెద్దులను ఆడించే వాళ్లపై కూడా కేసీఆర్ ప్రభుత్వం టాక్స్ లు విధిస్తారేమో.. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తాం. తెలంగాణలో ఆకుపచ్చ జెండాలను ఎగరనివ్వం. బంగాళాఖాతంలో కలిపేస్తాం.