నేడు రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన..రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే. తారక రామారావు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 10.30 గంటలకు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపూర్‌కు మంత్రి చేరుకుంటారు. అనంతరం నూతన పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేటకు చేరుకొని పల్లె‌ప్రకృతి వనాన్ని సందర్శిస్తారు. అదే గ్రామంలో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణం, రెడ్డి సంఘం భవనం, రైతు వేదికను ప్రారంభిస్తారు. డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పోచమ్మ దేవాలయాన్ని సందర్శిస్తారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చేరుకుని డబుల్ బెడ్రూం ఇండ్లను, బొప్పాపూర్‌లో పీఏసీఎస్ గోదాం, మధ్యాహ్నం 2గంటలకు ఎల్లారెడ్డిపేటలో జడ్పీటీసీ కార్యాలయాన్ని, మధ్యాహ్నం 2.30 గంటలకు హరిదాస్ నగర్‌లో గ్రంథాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు సిరిసిల్లకు చేరుకొని, పట్టణంలోని లహరి ఫంక్షన్ హాల్‌లో ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరవుతారు. 3.30 గంటలకు రాజీవ్ నగర్ గ్రామ శివారులో రూ.5కోట్లతో నిర్మించిన మినీ స్టేడియం, సాయంత్రం 4గంటలకు కొత్త చెరువును ప్రారంభిస్తారు. మంత్రి రాక సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తచెరువు, మినీ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు