గ్రూప్-1 ఉద్యోగాలకు జూన్ 4వ తేదీ వరకు గడువును పెంచుతూ ప్రకటన విడుదల చేసిన తెలంగాణ సర్కార్..

 


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల నిరుద్యోగులకు మంగళవారం అర్థరాత్రి శుభవార్త చెప్పింది. గత నెలలో విడుదలైన గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి, దరఖాస్తుల గడువు మంగళవారం ముగియనున్న నేపథ్యంలో నిరుద్యోగుల అభ్యర్థన మేరకు జూన్ 4వ తేదీ వరకు గడువును పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.



మొత్తం 503 పోస్టులకు ఇప్పటివరకు 3,48,095 దరఖాస్తులు రాగా, మంగళవారం ఒక్కరోజే దాదాపు 50 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకొన్నట్టు అధికారులు తెలిపారు. గడువు పొడిగించిన క్రమంలో మరికొందరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉందని, మంగళవారం నాటికి ఓటీఆర్‌ నమోదు, ఎడిట్‌ చేసుకొన్నవారి సంఖ్య 5,58,275కు చేరిందని పేర్కొన్నారు.


మరోపక్క పరీక్షల నిర్వహణపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే పోలీస్ ప్రిలిమినరీ పరీక్షలను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉందని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్షను 3 లక్షల మందికిపైగా రాయాల్సి ఉండటంతో ఆ రోజున ఇతర పరీక్షలు లేకుండా చూస్తున్నట్లు సమాచారం. నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో జూలై లేదా ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని సూచించినా, షెడ్యూల్‌లో కొంత మార్పు వచ్చే చాన్స్ ఉంది. ఇక మెయిన్‌ పరీక్షను నవంబర్ లేదా డిసెంబర్‌లో నిర్వహించనున్నట్టు ప్రకటించినా, అందులోనే మార్పులు జరిగే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.