బాలిక రేప్ కేసులో A-1 నిందితుడుగా సాదుద్దీన్‌..

 


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన..హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచార ఘటనకు పాల్పడినది ఐదుగురు వ్యక్తులని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. వీరిలో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌ కాగా, మిగతా నలుగురు మైనర్లుగా పేర్కొన్నారు. అత్యాచారానికి ముందే కారు దిగి వెళ్లిపోయిన మరో మైనర్‌ను ఆరో నిందితుడిగా చేర్చినట్లు చెప్పారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 44, పెద్దమ్మ గుడి వెనకాల ఇన్నోవా కారులో అత్యాచారం జరిగినట్లు వివరించారు. తొలుత ఓ మైనర్‌, ఆ తర్వాత ఇతర మైనర్లు, చివరగా సాదుద్దీన్‌ అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్నొన్నారు. బాలిక మెడ, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్ర గాయాలయినట్లు చెప్పారు.

బాలిక రేప్ కేసు A-1 నిందితుడు సాదుద్దీన్‌ను గురువారం నుంచి విచారించనున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. మూడురోజుల పాటు అత్యాచారానికి సంబంధించిన వివరాలపై ఆరాతీయనున్నారు. రేప్‌ పథకం ప్రకారం వేసుకున్న ప్లానా? అసలు ఎంతమంది పాత్ర ఇందులో ఉంది? ఎవరెవరి సహకారం ఉందనే కోణంలో సాదుద్దీన్‌ను ప్రశ్నించనున్నారు. ఆరుగురు నిందితుల్లో ఒకరు మేజర్, ఐదుగురు మైనర్లు ఉన్నారు. నాంపల్లి కోర్టు మాత్రం మేజర్ అయిన సాదుద్దీన్‌ను మాత్రమే కస్టడీకి అనుమతించింది. అయితే జువైనల్‌ అయినా మేజర్‌గా పరిగణించి శిక్షించే అవకాశం ఉందన్నారు అడ్వకేట్‌ పట్టాభి. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పోలీసులకు ప్రశ్నాస్త్రాలు సంధించారు. మూడు గంటల్లోనే డీసీపీ దర్యాప్తు ఎలా ముగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎమ్మెల్యే కొడుకే మొదటి ముద్దాయి అంటున్నారు రఘునందన్‌రావు.