భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. జూలై 18న పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే నెల 24న ముగియనున్న నేపథ్యంలో నూతన రాష్ట్రపతి ఎన్నికకు ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ గురువారమిక్కడ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీన నామినేషన్ల ఘట్టం మొదలవనుంది. 29వ తేదీ వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. 30న వాటి పరిశీలన జరుగుతుంది.
రాష్ట్రపతి ఎన్నికల నగారా
నామినేషన్ల ఉపసంహరణకు జూలై 2వ తేదీ తుది గడువు. ఎన్నిక అనివార్యమైతే 18వ తేదీన బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. పార్లమెంటు, ఆయా రాష్ట్రాల శాసనసభల్లో పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ అనంతరం అన్ని బ్యాలెట్ బాక్సులను పార్లమెంటుకు తరలించాల్సి ఉంటుంది. అక్కడే 21వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియల్లో కొవిడ్ ప్రొటోకాల్ కచ్చితంగా పాటించాలని, ప్లాస్టిక్ ఉపయోగించకూడదని రాజీవ్కుమార్స్పష్టం చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఈ ఎన్నికల కు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు.