గ్రూప్-1 ఇంటర్య్వూల కొనసాగింపు, నియామకాలకు ఏపీ హై కోర్టు గ్రీన్ సిగ్నల్..

 


గ్రూప్ – 1 పేపర్ల కరెక్షన్ లో లోపాలున్నాయంటూ ఆంధ్రప్రదేశ్  హై కోర్టులో దాఖలైన వ్యాజ్యంపై నేడు విచారణ జరిగింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం గ్రూప్-1 ఇంటర్య్వూల కొనసాగింపు, నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రీకౌంటింగ్ మాత్రమే ఉంది. రీ- వేల్యుయేషన్ గ్రూప్-1 లో లేదని ఏపీపీఎస్సీ  న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కరెక్షన్ లో లోపాలు లేవని తెలిపారు. వాదోపవాదనలు విన్న తర్వాత.. ఇచ్చిన జాబితా ప్రకారమే ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నియామకాలు కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని వెల్లడించింది. సమాధాన పత్రాలు, పిటిషనర్ల మార్కుల జాబితా సీల్డ్ కవర్ లో కోర్టు ముందు ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.


గతంలో.. గ్రూప్ -1 ప్రధాన పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దాఖలైన వ్యాజ్యాలపై విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ప్రశ్న పత్రాలను థర్డ్ పార్టీ తయారు చేసిందని తెలిపారు. మూల్యాంకనం కూడా థర్డ్ పార్టీ చేసిందని, ఈ నేపథ్యంలో పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోరారు. ఈ వ్యాజ్యాలపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం..తదుపరి చర్యలంటినీ నిలుపుదల చేస్తూ తీర్పును రిజర్వ్ చేసింది.