కస్టమర్ల భద్రతే లక్ష్యంగా జులై 1, నుంచి అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్ ఆచరణలోకి రాబోతున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం ఆన్లైన్ మర్చంట్ కంపెనీలు కస్టమర్ల కార్డ్ డేటాను నిల్వ చేయకూడదు. ఇందుకు సంబంధించి కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ గతేడాది ప్రవేశపెట్టిన 'టోకెనైజేషన్ రూల్స్'ను కంపెనీలు జులై 1 నుంచి అమలు చేయనున్నాయి. దీంతో కస్టమర్లు సురక్షితంగా ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించేందుకు వీలుంటుంది.
దేశీయ ఆన్లైన్ కొనుగోళ్లకు కార్డ్-ఆన్-ఫైల్ టోకెన్ విధానాన్ని ఆర్బీఐ గతేడాది తప్పనిసరి చేసింది. కార్డ్-ఆన్-ఫైల్ టోకెన్ విధానంలో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలను ఎన్క్రిప్టెడ్ 'టోకెన్' రూపంలో భద్రపరుస్తారు. ఈ టోకెన్ల సాయంతో కార్డ్ వివరాలను వెల్లడించకుండానే కస్టమర్లు ఆన్లైన్ పేమెంట్లు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇందుకు అనుగుణంగా ఒరిజినల్ కార్డ్ డేటా స్థానంలో ఎన్క్రిప్టెడ్ డిజిటల్ టోకెన్‌ను తీసుకోవాలి. దీంతో కస్టమర్లు భద్రంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఈ రూల్స్ జులై 1, 2022 నుంచి అమల్లోకి వస్తాయి. కస్టమర్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలను మర్చంట్ కంపెనీలు డిలీట్ చేయాల్సి ఉంటుంది. కాగా కార్డ్‌లను టోకెన్ విధానంలోకి మార్చే గడువును జనవరి 1, 2022 నుంచి జులై 1, 2022కి ఇప్పటికే ఆర్బీఐ పొడిగించింది.