నేడే భారత్-దక్షిణాఫ్రికా మధ్య చివరి టీ20 ..

 


 భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ క్లైమాక్స్ కు చేరుకుంది. తొలి రెండు మ్యాచ్ ల్లో దక్షిణాఫ్రికా నెగ్గగా..తర్వాతి రెండు టీ20ల్లో భారత్ గెలిచింది. దాంతో, ఇరు జట్లూ ఇప్పుడు 2-2తో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఐదో మ్యాచ్ ఫలితం సిరీస్ విజేతను తేల్చనుంది. ఇందులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత జట్టు కృత నిశ్చయంతో ఉంది.


గత రెండు మ్యాచ్ ల్లో ఘన విజయాలతో ఆతిథ్య జట్టు ఆత్మవిశ్వాసంలో కనిపిస్తోంది. మరోవైపు భారత్ లో ఇప్పటికిదాకా ఒక్క టీ20 సిరీస్ కోల్పోని సఫారీల జట్టు అదే రికార్డును కొనసాగించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌ కోసం భారత తుది జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు. నాలుగో మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించొచ్చు.


ఓపెనర్లు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ శుభారంభం ఇవ్వాలని జట్టు కోరుకుంటోంది. లోయర్ ఆర్డర్ లో హార్దిక్ పాండ్యాతో పాటు గత మ్యాచ్ లో మెరుపు హాఫ్ సెంచరీ చేసిన దినేశ్ కార్తీక్ మంచి ఫామ్ లో ఉండటం జట్టుకు సానుకూలాంశం. తొలి రెండు మ్యాచ్ ల్లో నిరాశ పరిచిన బౌలర్లు కూడా మూడు, నాలుగో టీ20ల్లో అద్భుతంగా రాణించారు. కానీ, టాపార్డర్ లో శ్రేయస్ అయ్యర్, మిడిలార్డర్ లో స్టాండిన్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ పైనే జట్టు ఆందోళన చెందుతోంది. ఈ సిరీస్ లో ఇద్దరూ పెద్దగా రాణించింది లేదు. అయ్యర్ రెండో మ్యాచ్ లో 40 పరుగులు చేసినా.. పంత్ మాత్రం నాలుగు ఇన్నింగ్స్ ల్లోనూ నిరాశ పరిచాడు.