జూలై 4న విశాఖలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ...

 


ప్రధాని నరేంద్ర మోదీ జూలై 4న విశాఖ రానున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు జూలై 4న భీమవరం వస్తున్న నరేంద్ర మోదీ అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు తెలియజేశాయి.విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు తెల్లదొరల మీద అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. ఆయన విశాఖ మన్యం బెబ్బులిగా మారి నాటి బ్రిటిష్ దొరల మీద భయంకరమైన యుద్ధం చేశారు.


అల్లూరి సీతారామరాజు విశాఖలోనే పుట్టారు. ఆయన స్వస్థలం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామం. ఆయన పోరాటం చేసింది చింతపల్లి అడవులలోనే. ఆయన మరణించినది కూడా విశాఖ జిల్లా ఏజెన్సీలోని కొయ్యూరులోనే కావడం గమనార్హం. అల్లూరి జీవితం విశాఖ జిల్లాతోనే ముడిపడి ఉండటంతో జయంతి ఉత్సవాలు భీమవరంలో నిర్వహిస్తున్నా ఆరోజు విశాఖ రావాలని మోదీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే విశాఖలో బహిరంగ సభను ఏర్పాటు చేశామని బీజేపీ చెప్తోంది