జ్ఞానవాపి మసీదు కేసులో విచారణ జరుపతున్న జడ్జికి బెదరింపులు . .

 


జ్ఞానవాపి మసీదు కేసులో విచారణ జరుపతున్న జడ్జికి బెదరింపులు మొదలయ్యాయి. జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని వీడియో తీయాలని ఆదేశించిన సీనియర్ డివిజన్ జడ్జి రవికుమార్ దివాకర్‌కు మంగళవారం బెదిరింపు లేఖ వచ్చింది. న్యాయమూర్తికి రక్షణగా తొమ్మిది మంది పోలీసులను ఏర్పాటు చేసినట్లుగా వారణాసి పోలీసు కమిషనర్ తెలిపారు. అదే సమయంలో ఈ విషయంపై విచారణ జరుగుతోంది. ఈ విషయమై అదనపు చీఫ్ సెక్రటరీ (హోమ్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, వారణాసి పోలీస్ కమిషనర్‌లకు పోలీసు కమిషనర్ వారణాసి సీనియర్ డివిజన్ జడ్జి దివాకర్ లేఖ రాశారు. ఇందులో తనకు బెదిరింపులు వస్తున్నట్లు వెల్లడించారు. అధికారులకు పంపిన లేఖలో, ‘ఇస్లామిక్ ఆగాజ్ ఉద్యమం’ తరపున ఈ లేఖ తనకు పంపినట్లు న్యాయమూర్తి వెల్లడించారు.త‌న‌కు మంగళవారం నాడు బెదిరింపు వచ్చిన‌ట్టు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇస్లామిక్ అఘాజ్ మూవ్‌మెంట్‌కు చెందిన కాషిఫ్ అహ్మద్ సిద్ధిఖీ నుంచి బెదిరింపు లేఖ వచ్చిన‌ట్టుగా వారాణసీ సివిల్ జడ్జి తెలిపారు.


ఈ నేపథ్యంలో వారణాసి పోలీస్‌ కమిషనర్‌ సతీష్‌ గణేష్‌ సమాచారం అందించారు. జడ్జి దివాకర్‌కు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేఖ అందిందని అన్నారు. దానితో పాటు మరికొన్ని పేపర్లు కూడా ఉన్నాయి. ఈ సమాచారాన్ని న్యాయమూర్తి తాజాగా వెల్లడించారు. ఈ కేసు విచారణ బాధ్యతలను వారణాసి డిప్యూటీ పోలీస్ కమిషనర్ వరుణకు అప్పగించినట్లు తెలిపారు. జడ్జి రవికుమార్ దివాకర్‌ భద్రతలో మొత్తం తొమ్మిది మంది పోలీసులను మోహరించినట్లు సీపీ గణేష్ వెల్లడించారు. అంతే కాకుండా వారి భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జడ్జిని హెచ్చరిస్తూ పంపిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.