తిరుమలలో నేటి నుండి సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం ..

 


తిరుమల వెంకన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుమల శ్రీవారికి రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో భక్తులున్నారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ   ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణ కోసం తిరుమలలో ప్లాస్టిక్‌ బాటిళ్లు, బ్యాగులు, కవర్లును నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక నుంచి టీటీడీ అలిపిరి దగ్గర భక్తులను తనిఖీ చేయనుంది. ప్లాస్టిక్‌ ఉపయోగించే షాపులను సీజ్‌ చేస్తామని టీటీడీ స్పష్టం చేసింది.


ప్లాస్టిక్‌ను నిషేధించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. బుధవారం నుంచి అంటే జూన్‌ 1వ తేదీ నుంచి తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం అమల్లోకి రానుంది. అలాగే తిరుమలలో షాంపు ప్యాకెట్ల వాడకం కూడా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.


అయితే హోటళ్లలో ప్లాస్టిక్‌ కవర్స్‌ను ఉపయోగించినట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే తిరుమలలో దుకాణాదారులు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఇక్కడే కాకుండా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరైనా ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేయకుండా కఠిన చర్యలు ఉంటాయని తిరుమల తిరుపతి దేవస్థానం హెచ్చరించింది.