చరణ్, శంకర్ సినిమాకి టైటిల్ ఫిక్స్..

 


మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ 'ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. దానికి తగ్గట్టుగానే అతడి తదుపరి చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల కాబోతున్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అతడి తాజా చిత్రం ఇదో కోవలో విడుదల కానుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఇది 50వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ సక్సెస్ సాధించి.. తన పాన్ ఇండియా స్టార్ డమ్ ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు చెర్రీ. అందుకు తగ్గరీతిలో ఈ సినిమాలోని పాత్రకోసం కష్టపడుతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ 

కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, జయరామ్, శ్రీకాంత్, యస్.జే.సూర్య తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 


ఈ చిత్రంలో రామ్ చరణ్ ఐఏయస్ ఆఫీసర్ గా నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపిస్తాడని అంటున్నారు. అలాగే. అతడు తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని కూడా వార్తలొస్తున్నాయి. ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ పై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. సాధారణంగా దర్శకుడు శంకర్.. తన చిత్రాలు మాస్ కంటెంట్ తో ఉన్నప్పటికీ.. వాటికి క్లాసీ టైటిల్స్ పెట్టడంలో ఆసక్తి చూపిస్తుంటాడు. సరిగ్గా RC 15 చిత్రానికి కూడా అదే సూత్రం అప్లై చేయబోతున్నాడని టాక్. ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు సినిమా మొదలైన కొత్తలో వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ‘సర్కారోడు’  అనే మరో టైటిల్ కూడా వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత ‘అధికారి అనే మరో టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టింది. ఇప్పుడు కొత్తగా ‘ఆఫీసర్’  అనే టైటిల్ వినిపిస్తోంది. 


నిజానికి ‘సర్కారోడు’ అనే టైటిల్ పెట్టాలని దిల్ రాజు ఆలోచనట. అయితే శంకర్ కు మాత్రం ‘ఆఫీసర్’ అనే టైటిల్ ను ఖాయం చేయాలని ఉందట. రామ్ చరణ్ కూడా అదే టైటిల్ పెట్టమని సూచించాడట. ఆఫీసర్ అనే టైటిల్ కు యూనివర్సల్ అప్పీల్ ఉంది. పైగా పాన్ ఇండియా కేటగిరిలో రాబోతున్న ఈ సినిమాకి అదే టైటిల్ యాప్ట్ . అదే దిల్ రాజు సూచించిన టైటిల్ మాసీగా, లోకల్ అప్పీల్ తో ఉంది. దీనికి పాన్ ఇండియా రీచ్ లేదు. మిగతా భాషల్లో విడుదల చేయడానికి మరో టైటిల్ వెతకాలి. అందుకే మూడొంతులు ‘ఆఫీసర్’ అనే టైటిలే ఖాయమవుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.