జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రాష్ట్రవ్యాప్త యాత్రకు కొత్త వాహనాలు సిద్ధం..

 


విజయ దశమి నాడు తిరుపతి నుంచి మొదలయ్యే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రాష్ట్రవ్యాప్త యాత్రకు కొత్త వాహనాలు సిద్ధమయ్యాయి. ఎనిమిది బ్లాక్ కలర్ స్కార్పియోలు మంగళగిరి లోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నాయి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని పవన్ నిర్ణయించారు. జనసేనాని పర్యటనకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. వీటికి పూజ కార్యక్రమాలు చేసిన తర్వాత పవన్ కల్యాణ్ ప్రారంభిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. అక్టోబర్‌ 5న దసరా రోజున తిరుపతి నుంచి ప్రారంభించి ఆరు నెలల్లో రాష్ట్రమంతా పవన్ పర్యటిస్తారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు జనసేన నేతలు పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటనలు ఉండేలా రూట్‌మ్యాప్‌ రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే జనసేనాని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లోనే ఎన్నికలు ఉంటాయనే సంకేతాలు వస్తున్నందున ఆయన స్పీడ్ పెంచారు. దసరా లోపు తాను ఒప్పుకొన్న సినిమా షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు పవన్.