ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ఖరారైంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన అనంతరం జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేశామని పేర్కొన్నారు.
ఎన్డీఏ పక్షాలన్నింటితో చర్చించిన తర్వాతే ముర్ము పేరును ప్రకటించామని తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిపై దాదాపు 20 మంది గురించి ఆలోచించామన్నారు.
రాష్ట్రపతిగా ఎస్టీ మహిళను ఎంపిక చేయాలని నిర్ణయించామని జేపీ నడ్డా వెల్లడించారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అని కొనియాడారు. మంత్రిగా, గవర్నర్‌గా ద్రౌపది ముర్ము రాణించారని ఆయన తెలిపారు. గతంలో ఆమె జార్ఖండ్ గవర్నర్‌గా పని చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె టీచర్‌గా పని చేశారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో ముర్ము జన్మించారు.