రాష్ట్రపతి ఎన్నికల్లో మహాత్మా గాంధీ మనవడు గోపాల కృష్ణ గాంధీ..

 


రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మరో కొత్తపేరు తెరపైకి వచ్చింది. తాజాగా మహాత్మా గాంధీ మనవడు గోపాల కృష్ణ గాంధీ పేరును లెఫ్ట్ పార్టీలు ప్రతిపాదించాయి.

తాజాగా మహాత్మా గాంధీ మనవడు గోపాల కృష్ణ గాంధీ పేరును లెఫ్ట్ పార్టీలు ప్రతిపాదించాయి. రాష్ట్రపతిగా పోటీ చేయాలని వామపక్షాలు కోరినప్పటికీ గోపాల కృష్ణ గాంధీ తన నిర్ణయం చెప్పేందుకు కొంత సమయం అడిగారు.


శరద్ పవార్‌తో సమావేశం సందర్భంగా ఆయన ఒప్పుకోకపోవడంతో, వామపక్షాలు గోపాల కృష్ణ గాంధీ పేరును ప్రతిపాదించాయి. దీనికి శరద్ పవార్ కూడా వ్యతిరేకత తెలపలేదని సమాచారం. మరోవైపు ఈ రోజు జరిగే సమావేశంలో ఆయన పేరుపై పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై గోపాల కృష్ణ గాంధీ కూడా స్పందించారు. ''రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేసేందుకు నా పేరు కూడా ప్రతిపాదించారు. అయితే, దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం అడిగాను. ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతకుమించి దీని గురించి మాట్లాడటం సరికాదు'' అని ఆయన అన్నారు.


2017లో కూడా ఆయన ఉపరాష్ట్రపతిగా ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ, ఓడిపోయారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నిక కోసం ప్రతిపక్షాలు ఆయన పేరును పరిశీలిస్తున్నాయి. 77 ఏళ్ల వయసున్న గోపాల కృష్ణ గాంధీ భారత రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. దక్షిణాఫ్రికా, శ్రీలంకలో భారత రాయబారిగా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కూడా సేవలందించారు.