దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం ...

 


దేశ రాజధాని ఢిల్లీలోని జామియా నగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జామియా నగర్‌లోని మెట్రో పార్కింగ్ స్థలంలో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పార్కింగ్‌లోని వందకు పైగా వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని 11 ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. మెట్రో పార్కింగ్‌లో మంటలు చెలరేగడంతో 10 కార్లు, ఒక మోటార్‌సైకిల్, రెండు స్కూటీలు, 30 కొత్త, 50 పాత ఈ-రిక్షాలు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు.


జరిగిన ప్రమాదంపై ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. జామియా నగర్ ప్రాంతంలోని ప్రధాన పార్కింగ్ ఏరియాలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఉదయం 5 గంటలకు సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లినట్టు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రెస్క్యూ సమయంలో OSI ఫతే చంద్,మేనేజర్ మనోజ్ జోషి సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని గార్గ్ తెలిపారు.