ఇక నుండి ఇంటి వద్ద నుండే ఆధార్ కార్డు అప్డేట్..

  

దేశంలో పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. ఇంట్లోని సభ్యులందరికీ ఇది ఉంటుంది. కొన్నిసార్లు అందులో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆధార్ అప్‌డేట్ కోసం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ మార్పులు చేసుకునేందుకు ఇకపై ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డుకు సంబంధించిన ఏపనినైనా ఇంట్లో కూర్చునే చేసుకునేందుకు వెసులుబాటు రానుంది.ఇకపై ఆధార్ కార్డులో ఏదైనా మార్పు కోసం మీరు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేదు. మీ ఇంటి వద్దకే ఈ సేవను అందించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వేగంగా పని చేస్తోంది. ఈ సదుపాయం అమలులోకి వచ్చిన వెంటనే.. మీరు ఇంట్లో కూర్చొని మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడం, చిరునామా మార్చుకోవటం లాంటి మరిన్ని అప్‌డేట్‌లను పొందగలుగుతారు.


ప్రస్తుతం మీరు ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే.. మీరు తప్పక ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సిందే. UIDAI కొత్తగా తెస్తున్న పథకం అమలు చేయబడితే.. ఈ సేవలను పొందేందుకు మీరు ఇకపై ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లనక్కర్లేదు. ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు.. ప్రస్తుతం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 48,000 పోస్ట్‌మ్యాన్లకు శిక్షణ ఇస్తోంది. శిక్షణ పూర్తయిన తర్వాత వీరి ద్వారా ఇంటి వద్ద కూర్చొని ఆధార్ సంబంధిత సేవలను పొందవచ్చు. మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. తపాలా శాఖకు చెందిన పోస్ట్‌మ్యాన్‌ సహకారంతో ఇది కార్యరూపం దాల్చనుంది. దీని కింద దాదాపు 1.5 లక్షల మంది పోస్టాఫీసు ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నారు. దీని తర్వాత.. ఏ వ్యక్తి అయినా ఆధార్‌కు సంబంధించిన అన్ని పనులను ఇంట్లో కూర్చొని పూర్తి చేయగలుగుతారు. పోస్ట్‌మ్యాన్‌కు శిక్షణతో పాటుగా ఈ ప్రక్రియలో అవసరమైన అన్ని సౌకర్యాలను UIDAI అందజేస్తుంది.


ల్యాప్‌టాప్ వంటి అన్ని డిజిటల్ సౌకర్యాలను పోస్ట్‌మ్యాన్‌కు యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అందజేస్తుందని తెలుస్తోంది. తద్వారా వారు రికార్డుల్లో ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని అప్‌డేట్లను చేయవచ్చు. దీనితో పాటు.. పోస్ట్‌మెన్లు కూడా పిల్లల వివరాలను నమోదు చేయవచ్చు. ఇది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరణ ప్రణాళికలో ఒక భాగమని తెలుస్తోంది. దీంతో రానున్న కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులు కూడా తొలగిపోనున్నాయి