కమెడియన్ అదిరే అభికి షూటింగ్ లో తీవ్రగాయాలు

 

జబర్దస్త్ షో మొదలుపెట్టినప్పటి నుంచి బుల్లితెర ఆడియన్స్‌ను తనదైన శైలిలో నవ్విస్తూ.. ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు కమెడియన్ అదిరే అభి. తాను ఎదగడంతో పాటు.. తన టీమ్‌లో ఎంతోమందికి అవకాశాలు ఇచ్చి జీవితాన్ని ఇచ్చాడు. ఇటీవల జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పిన అభి.. మా టీవీలో ప్రసారమయ్యే కామెడీ షోలో ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ తన డిఫరెంట్ కాన్సెప్ట్ స్కిట్లతో అభిమానులను అలరిస్తున్నాడు.
టీవీ షోలతో పాటు అదిరే అభి సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. గత కొద్దిరోజులుగా ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న అభి.. యాక్షన్ సన్నివేశాల్లో స్టంట్స్ చేసే క్రమంలో తీవ్రగాయాలు అయినట్లు తెలిసింది. స్టంట్స్ కోసం ముందే శిక్షణ తీసుకున్నా.. షూటింగ్ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షూటింగ్ స్పాట్‌లో ప్రథమ చికిత్స అనంతరం అభిని ఆసుపత్రికి తరలించారు. అభి చేతికి 15 కుట్లు పడగా.. కాళ్లకు కూడా గాయాలు అయినట్లు సమాచారం. అభికి ఎలాంటి ప్రమాదం లేదని.. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు.


రెబల్ స్టార్ ప్రభాస్ తెరంగేట్రం చేసిన ఈశ్వర్ మూవీలో అభి సహాయ నటుడిగా అలరించాడు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన అభి.. కొద్ది రోజులు టీవీలో యాంకర్‌గా కూడా పనిచేశాడు. జబర్దస్త్ షో మొదలైన తరువాత టీమ్ లీడర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. తన స్కిట్లలో కామెడీతో పాటు ఓ మంచి మెసేజ్ కూడా ఇవ్వడం అదిరే అభి స్పెషాలిటీ. తన టీమ్‌లో ఎంతో మంది ఆర్టిస్టులకు ఛాన్స్ ఇచ్చి లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు బుల్లితెరపై స్టార్ కమెడియన్‌గా ఉన్న ఆది కూడా అభి టీమ్ నుంచి వచ్చినవ్యక్తే.