ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష నేతలకు మమతా బెనర్జీ లేఖ..

 


రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నడుం బిగించారు. శనివారం ఆమె ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష నేతలకు ఓ లేఖ రాశారు. జూన్ 15న న్యూఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేస్తున్నానని, అందరూ హాజరుకావాలని కోరారు. 


ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ట్వీట్‌లో, రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు అభ్యుదయవాద ప్రతిపక్ష పార్టీల నేతలందరినీ మమత బెనర్జీ ఆహ్వానించారని తెలిపింది. ఈ సమావేశం న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జూన్ 15న మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుందని తెలిపింది. విభజన శక్తులకు వ్యతిరేకంగా బలమైన, సమర్థవంతమైన ప్రతిపక్షాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.