ఆజాదీకి అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో కొత్త నాణాలను విడుదల చేసిన ప్రధాని మోడీ..

 


ఆజాదీకి అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా ఐకానిక్‌ వీక్‌ సెలబ్రేషన్స్‌ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా కొత్త నాణాలను మోదీ విడుదల చేశారు.

కేంద్ర ఆర్ధికశాఖ , కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను సోమవారం నిర్వహిస్తున్నారు. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా వేడుకలో పాల్గొన్నారు. కొత్త నాణేల శ్రేణిని ఆవిష్కరించారు ప్రధాని మోడీ. అంధులు కూడా సులభంగా గుర్తించేలా వీటిని రూపొందించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని నిర్వహిస్తోన్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లోగోను రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 మారకపు విలువ కలిగిన కొత్త నాణేలపై ముద్రించారు. ఇవి కేవలం స్మారక నాణేలు మాత్రమే కాదని.. త్వరలో చలామణిలోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ వెళ్లడించింది. ఈ కొత్త నాణేలు దేశాభివృద్ధి కోసం పనిచేసేలా ప్రజల్లో స్ఫూర్తి నింపుతాయని మోదీ వెల్లడించారు. 12 ప్రభుత్వ పథకాలతో అనుసంధానించిన 'జన సమ్మర్థ్‌ పోర్టల్‌'ను కూడా ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రారంభించారు.

అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థల్లో భారత బ్యాంకులు, కరెన్సీని భాగం చేయాల్సిన అవసరం ఉందని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా విడుదల చేసిన నాణాలు అమృత్‌ కాలం నాటి అద్భుత ఘడియలను ప్రజలకు నిరంతరం గుర్తు చేస్తాయన్నారు మోదీ. గత 8 ఏళ్లలో దేశంలో ఎన్నో ఆర్ధిక సంస్కరణలను అమలు చేసినట్టు తెలిపారు. డిజిటల్‌ పేమెంట్స్‌కు రోజురోజుకు బాగా ఆదరణ పెరుగుతోందని వెల్లడించారు. ముద్ర బ్యాంక్‌తో చిరు వ్యాపారులకు వేగంగా రుణాలు అందుతున్నాయని వెల్లడించారు. అందుకోసం ఆర్థిక సంస్థలు మెరుగైన ఆర్థిక, కార్పొరేట్‌ పాలనాపద్ధతులను అనుసరించాలని సూచించారు. ఇప్పటికే భారత్‌ అనేక ఆర్థిక పరిష్కార వేదికలను ఆవిష్కరించిందన్నారు. వాటి వినియోగాన్ని పెంచడం కోసం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే వాటన్నింటినీ విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ను ప్రపంచం ఇప్పుడు ఒక పెద్ద వినియోగ మార్కెట్‌గానే కాకుండా అనేక సమస్యలకు పరిష్కార వేదికగా చూస్తోందని వ్యాఖ్యానించారు.

ఇది ఇతర నాణేల వలె గుండ్రంగా కాకుండా బహుభుజిలో ఉంటుంది. ఈ నాణెం మధ్యలో మీకు అశోక స్తంభం సింహాలు కనిపిస్తాయి. దీని తయారీకి నికెల్ వెండి మరియు ఇత్తడిని ఉపయోగించారు. దృష్టి లోపం ఉన్నవారు కూడా సులభంగా అర్థం చేసుకోగలరు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి నాణేలు విడుదల చేయబడ్డాయి. వీటిపై బ్రెయిలీ లిపిలో ముద్రించబడుతుంది. దీని సహాయంతో అంధులు లేదా దృష్టి లోపం ఉన్నవారు సులభంగా అర్థం చేసుకోగలరు