నేడే తెలంగాణా లో టెట్ పరీక్ష


సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మొదటి అడుగుపడిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీచర్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌) ఆదివారం జరగనుంది. పరీక్ష నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. చాలా కాలం తర్వాత టెట్‌ నోటిఫికేషన్‌ రావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌ పరీక్ష కోసం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంతరం లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ టెట్ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 2016 మే, 2017 జులైలో టెట్ పరీక్ష నిర్వహించారు. ఐదు సంవత్సరాల తర్వాత టెట్ నోటిఫికేషన్


వెలువడటం, బి.ఇడి అభ్యర్థులకు పేపర్ 1 రాసేందుకు అవకాశం కల్పించడంతో ఈసారి కొత్త, పాత అభ్యర్థులు టెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు. ఈసారి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో గతంలో టెట్ ఉత్తీర్ణులైన బి.ఇడి, డి.ఇడి అభ్యర్థుల్లో అధిక శాతం తమ స్కోర్‌ను పెంచుకునేందుకు మరోసారి టెట్ రాస్తున్నారు. టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్ అభ్యర్థులు 60 శాతం, బిసి అభ్యర్థులు 50 శాతం, ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగుల కేటగిరీకి చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులను సాధించాలి.