తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు..

 


తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్ చివరి తేదీని రూ. 500ల ఆలస్య రుసుమతో జూన్‌ 23 వరకు పొడిగిస్తున్నట్లు ఈసెట్‌ కన్వీనర్‌ కె విజయకుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి బీటెక్‌ రెండో ఏడాదిలో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాల కోసం ఈసెట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు గడువు సమయం ముగింపు లోగా అధికారిక వెబ్‌సైట్‌ ecet.tsche.ac.inలో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నోటిఫికేషన్‌లో తెల్పిన తేదీల ప్రకారం.. రూ.500ల ఆలస్య రుసుము లేకుండాతో జూన్‌ 14న వరకు, రూ.2,500ల ఆలస్య రుసుముతో జులై 6 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. కాగా తాజాగా ఈ మేరకు చివరి తేదీని పొడిగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.


ఇక ఈసెట్‌ పరీక్ష జూలై 13న రెండు షిఫ్టుల్లో, ఒకే రోజులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌ విధానంలో జరగనుంది. ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ స్ట్రీమ్‌లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఇక సీఐవీ, సీహెచ్‌ఈఎం, ఎంఈసీ, ఎంఐఎన్‌, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం విభాగాలకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తుంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరపున జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (JNTUH) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్షను నిర్వహించడం జేఎన్‌టీయూహెచ్‌కి ఇది ఏడోసారి.