కరోనా ఫోర్త్ వేవ్ పై డబ్ల్యూహెచ్‌వో కీలక సూచనలు..

 


మళ్లీ పంజా విసురుతోంది కరోనా మహమ్మారి.. దానికి వ్యాక్సినేషన్‌తోనే చెక్‌ పెట్టాలని అనేక పరిశోధనలు తేల్చాయి.. దీంతో, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.

భారత్‌లోనూ భారీ సంఖ్యలో వ్యాక్సిన్ల పంపిణీ జరిగింది.. కొన్ని దేశాల్లో మందకొడిగానే ఉంది. మరోవైపు, కొత్త వేరియంట్లు, కొత్త వేవ్‌లో పుట్టుకొస్తూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. కరోనా వేవ్‌లు, బూస్టర్‌ డోస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌.. 4-6 నెలలకు ఒక కొత్త వేవ్‌ పుట్టుకొస్తున్న ఈ తరుణంలో బూస్టర్‌ డోస్‌ తప్పనిసరిగా తీసుకోవాలని.. బలహీనంగా ఉన్నవారికి మూడో డోసు అనివార్యమని స్పష్టం చేశారు.


వ్యాక్సినేషన్‌పై ప్రజలను ప్రభుత్వాలే అప్రమత్తం చేయాలని.. బలమైన దీర్ఘకాలిక రోగనిరోధకశక్తి కోసం బూస్టర్‌ డోసులు వేసుకోవాలని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌. ఇక, ఇండియాలో మళ్లీ కోవిడ్‌ కేసులు పెరగడానికి అనేక కారణాలున్నాయన్న ఆమె.. ఇమ్యూనిటీ తగ్గిపోతుండటంతో పాటు.. అధిక వ్యాప్తి కలిగిన బీఏ.4, బీఏ.5 ఒమిక్రాన్‌ ఉపవేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.. మరోవైపు, మళ్లీ కోవిడ్‌ కేసుల పెరుగుదలకు ప్రజల ప్రవర్తన కూడా కారణమన్న ఆమె.. మాస్కులు లేకుండానే ప్రజలు విచ్చవిడిగా తిరుతున్నారని.. ఇప్పటికైనా మాస్కులు ధరించాలని సూచించారు.