హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాని కోరిన మంత్రి కేటీఆర్..

 


హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి సహకరించాలని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే తారకరామరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ను కేటీఆర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌, రాజీవ్‌ల మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశానికి కేటీఆర్‌తో పాటు ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి హాజరయ్యారు.


ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఐటీ అభివృద్ధికి అందిస్తున్న ప్రోత్సాహకాలను కేంద్ర మంత్రికి తెలిపారు. 2014 నుంచి ఇప్పటిదాకా జాతీయ ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని కేటీఆర్‌ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌లను నెలకొల్పాయని చెప్పుకొచ్చారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఐటీ రంగంలో కేవలం ఢిల్లీ, బెంగళూరు, పుణె వంటి నగరాలపైనే కాకుండా హైదరాబాద్‌పై కూడా దృష్టిసారించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు.


సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. కేంద్ర మంత్రి సమావేశానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ.. ‘భారత్‌లో ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమ, నైపుణ్యాభివద్ధి అంశాలంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌తో సమావేశం జరిగింది. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణాన్ని రూపొందించడానికి తెలంగాణ ప్రయత్నిస్తోంది’ అంటూ ట్వీట్‌ చేశారు.